19, ఏప్రిల్ 2014, శనివారం

ళకార మీమాంస-4 (సమాప్తం)

క్కడ గమనించాల్సిన విశేషమేమంటే – “డలయో రభేదః అని చెప్పే వ్యాకరణ సంప్రదాయాలున్నప్పటికీ, భారతీయుల ఉచ్చారణ అలవాట్ల దృష్ట్యా మూర్ధన్య డకారం నేరుగా అంతఃస్థ లకారంగా మారదుఅనేది. సదరు సూత్రాలు శబ్దపరిణామ ఫలితాన్ని చెబుతున్నాయే తప్ప అది జఱిగే ప్రక్రియని వివరించడం లేదు. కనుక మూర్ధన్య డకారం లకారంగా మారడానికి ముందు కొంతకాలం పాటు మూర్ధన్య ళకారంగా ఉచ్చరించబడే దశ ఒకటి అవశ్యం ఉండక తీఱదు. పైన జల-జడశబ్దాలకిచ్చిన అర్థాల మధ్య పైకి వైరుద్ధ్యం ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ వాటి నడుమ గల కార్యకారణ సంబంధాన్ని కూడా గమనంలో ఉంచుకున్నట్లయితే జళమే జలశబ్దం యొక్క పూర్వరూపమని విశదమౌతుంది. ఇటువంటి పదాలు ఇంకా ఎన్నున్నాయో పరిశోధించి వెలికితీయాల్సి ఉంది.

లయప్రతిక్షేపం ఫలితంగా సంస్కృతంలో కొన్ని పదాలు రెండర్థాలనివ్వడం మొదలుపెట్టాయి. మచ్చుకు నా దృష్టికొచ్చిన కొన్ని పదాలు :

వ్యాలః – పాము, ఏనుగు
కాలః – కాలము, యముడు, నలుపు
వాలః - తోక, ఆయుధం
ఆలిః – పంక్తి, వంతెన
తాలః – తాడిచెట్టు, సంగీత తాళం
శూలః – బల్లెం, నొప్పి
వేలా – సమయం, చెలియలికట్ట
కలా – భాగం, నైపుణ్యం
కోలమ్/కోలః – తెప్ప, రేగుపండు, అడవిపంది
కువలయమ్ – భూమి, కలువ
దలమ్  ఆకు, సైన్యం

పాణినీయంలో ళకారానికి స్థానమివ్వలేదనేది నిజమే, మాహేశ్వరసూత్రాల్ని పరిశీలించినప్పుడు. కానీ ఆ వ్యాకరణం వేదసాహిత్యాన్ని నిలబెట్టేందుకే రచించబడిందనే మాటలో వాస్తవం లేదు. పాణినికి పూర్వం వ్యాకరణగ్రంథాలు లేకపోతేనే ఆ మాట నిజం. కానీ మనకి అష్టాధ్యాయిలో పూర్వాచార్యుల పేర్లు అనేకం దర్శనమిస్తాయి. వారు ఏం వ్రాశారో మనకు తెలీకపోయినా పాణిని కంటే పురాతనులు గనుక వైదిక సంస్కృతాన్ని వ్యాకరించకుండా ఉండరనుకోవచ్చు. కనుక పాణినీయ లక్షణం ప్రధానంగా ఆనాటి శిష్టుల వ్యవహారంలోని లౌకిక సంస్కృతం కోసమే. అందువల్లనే అందులో ళకారానికి చోటు లభించలేదు. అప్పటికే ప్రాకృతాలు విస్తృతంగా వాడుకలోకి వచ్చేయడం జఱిగింది. నేటివారు ళకారం నిసర్గద్రవిడమని భ్రమిస్తున్నట్లే నాటివారూ దాన్ని ప్రాకృతానికి విలక్షణంగా పరిగణించి ఉంటారు. వైదికభాషకి ప్రథమ ప్రాకృతమని పేరుండడం కూడా ఈ అపోహకి దారితీసి ఉంటుంది. 

ఏతావతా, ళకార విస్మృతికి లోనైన ఉత్తరాదివారి ముద్రితగ్రంథాల్ని చూసి అవే సాధువని భ్రమించి అనుకరించే ప్రయత్నంలో మన తెలుగులిపిలో ఉన్న సంస్కృతగ్రంథాల ళకార పాఠాల్ని లకారపాఠాలుగా పరివర్తింవద్దని అందఱికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 
(సమాప్తం) 

2 కామెంట్‌లు: