29, ఏప్రిల్ 2014, మంగళవారం

తెలుగులో మేషస్వరం-2



షస్వరాన్ని ఈ విధంగా లిపిబద్ధం చెయ్యడంలో ఉన్న మఱో ఉద్దేశం – తప్పనిసరైన అన్యదేశ్యాల నుంచి సాంకేతిక ఆదానాల్ని (technical borrowings) మూలవిధేయంగా (faithful to the original) తీసుకోగలిగేలా సులభతరం చెయ్యడం, ఆ విధంగా తెలుగులో సాంకేతిక పాఠ్యపుస్తకాల రచనాపరంగా ముందుకు పోవడం. 


అప్పట్లో ఈ విషయమై మా మిత్రుల మధ్య జఱిగిన ఒక విద్యాత్మక చర్చలోని అంశాల గుఱించి ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాదనుకుంటా. శ్రీ చరసాల ప్రసాద్ గారనే మిత్రుడు ఈ ప్రయత్నం గుఱించి ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అప్పుడు వారితో నే నన్నాను : అవసరాన్ని బట్టి పాత అక్షరాలు మఱుగున పడడం, కొత్త అక్షరాలు వాడుకలోకి రావడం మామూలే. వెయ్యేళ్ళ క్రితం మన తెలుగులో బండిఱా లాంటి ఒక విచిత్రమైన అక్షరం [ష్జ] ఉండేది. బండిఱా లో ఉన్న అడ్డగీత తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది దాని వ్రాతపద్ధతి. దాన్ని ఇటు [ళ] గానూ కాకుండా అటు [ష] గానూ కాకుండా మధ్యరకంగా పలికేవారు. నన్నయగారు ఆ అక్షరాన్ని తొలగించారని కొంతమంది నమ్ముతున్నారు. కాదు, దానంతటదే వాడుకలోంచి కనుమఱుగైందని ఇంకొందఱు నమ్ము తున్నారు. మన తెలుగులో కనుమఱుగైనా [] అనే వర్ణం రూపంలో అఱవంలో అది ఇప్పటికీ సజీవమే. మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టకముందు తమిళంలో [ష, , క్ష, శ్రీ] అనే అక్షరాలు ఉండేవి కావు. ప్రాచీన గ్రంథలిపి బాటలో ఆయన తమిళ లిపికి చేసిన సంస్కరణల్ని తమిళులు ఆమోదించి ముద్రణలో వాటికి స్థానం కల్పించారు. అలాగే Bishop Caldwell రాకముందు తమిళంలో [ఏ] అనే దీర్ఘం ఉండేది కాదు. హ్రస్వరూపం ఒక్కటే ఉండేది. ఉచ్చారణలో ఉన్నప్పటికీ లిపి మాత్రం దాన్ని ప్రతినిధించేది కాదు.”   

మఱో మిత్రుడు శ్రీ వై.రామనాథరెడ్డిగారు నా కొత్త అక్షరాన్ని పూర్తిగా ఆమోదించకపోయినా ఈ దిశలో ఏదో ఒక ప్రయత్నం జఱిగినందుకు తమ హర్షాన్ని వెలిబుచ్చారు. అయితే అంతర్జాతీయ యునికోడ్ సంస్థవారు కనీసం గత వందేళ్ళుగా అచ్చులో ఉన్న వర్ణాలకే యునికోడ్ సంకేతాల్ని కేటాయిస్తారని ఆయన అన్నారు
మేషస్వరానికీ హ్రస్వరూపం ?

అప్పట్లో ఫ్రాన్సులో విద్యాభ్యాసం చేస్తున్న శ్రీ కిరణ్ వారణాశి అనే యువభాషావేత్త ఈ విషయమై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “దీర్ఘరూపంతో పాటు హ్రస్వరూపం కూడా ఆలోచిస్తే ఎలావుంటుంది ? మన తెలుగులో ఇంచుమించు ప్రతీ అచ్చుకి దీర్ఘ-హ్రస్వ రూపాలు రెండూ ఉంటాయి కదా !  నే', వే', తాటే'కు, డే'న్సు, 'క్షన్, 'క్టివేట్ (అనే దీర్ఘ స్వరాలకి మీరు సూచించిన గుర్తు సరిపోతుంది) ఇంగ్లీషులోని హ్రస్వ-మేషస్వరం కూడా ఒకటుంది. ఉదాహరణకు, వె'ర్టికల్, సె'ర్టిఫికెట్, పె'ర్టినెంట్ మొదలైన పదాలు.  దీనికి ఇంకో గుర్తు అవసరమంటారా ?” అన్నారు. 

అందుకు నేనాయనతో, “మేషస్వరానికి హ్రస్వోచ్చారణ తెలుగులో కూడా ఉంది. కాని దానికి హ్రస్వరూపం ఉండడం తప్పనిసరి కాదు. ప్రస్తుతానికి ఎత్వం సరిపోతుంది. దానికీ దీనికీ మధ్య ఉచ్చారణలో అంత గమనీయమైన వ్యత్యాసం  (noticeable variance) లేకపోవడం ఒక సమస్య. మన భాషలో [] అనే ఒక పాములాంటి అక్షరాన్ని ఒకటో తరగతిలో అందఱికీ నేర్పుతారు. ఆ తరువాత తమ జన్మలో ఎవఱూ దాన్ని ఏ పదంలోనూ వాడగా చూసి ఉండరు. అది అనుపయుక్తమైన ఆఱో వేలుగా, పులిహోరలో కఱివేపాకులా మిగిలిపోతుంది. ఒక కొత్త అక్షర కల్పన గానీ, కొత్త పదకల్పన గానీ ఒక బిడ్డని కనడంలాగా మన మీద పెద్ద బాధ్యతని మోపుతాయి. కొత్త అక్షరాలు వాటిని నేర్చుకునే చిన్నారుల మీద బరువు మోపుతాయి. ఇప్పటికే మనకు 50 కంటే ఎక్కువ అక్షరాలున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం సంస్కృతానికి మూలవిధేయమైన తత్సమాల్ని అరువు తెచ్చుకోవడం కోసం ఉంచుకున్నవి. మనకిప్పుడు ఇంగ్లీషు పట్ల మూలవిధేయత అవసరమై ఇంకొకటి జతచేర్చాం. బాధాకరమే కాని తప్పలేదు.” అన్నాను.
తెలుగులో మేషస్వరం పలికే సందర్భాలు
మేషస్వరం కోస్తా, రాయలసీమ మాండలికాల్లోనే తప్ప శుద్ధమైన తెలంగాణ మాండలికంలో శ్రుతిగోచరం కాదు. కోస్తా, రాయలసీమ ప్రజలు పలికే మేషస్వరం కూడా ససందర్భీణం కాదు. అంటే, వారు కొన్ని సందర్భాల్లో పలికితే వీరు కొన్ని సందర్భాల్లో పలుకుతారు. ఉదాహరణకి, కోస్తాలో “లేదు” అని చేసే వ్యక్తీకరణని రాయలసీమవారు “ల్యా” అని సరిపెడతారు. అలాగే కోస్తాలో “ఉన్నాడు” అనేదాన్ని సైమేయులు “ఉన్న్యాడు” అని పలుకుతారు. ఇందుకు భిన్నంగా, సైమేయులు “ఉంటాడు” అని పలికేదాన్ని కాళింగులు (కళింగ దేశస్థులు) “ఉంట్యాడు” అని పలుకుతారు. ఇదంతా గమనించినప్పుడు మన భాషలో మేషస్వర ప్రతిపత్తి ఇంకా ద్రవస్థితిలోనే ఉందనీ, దాని ఉచ్చారణప్రకరణాలు భాషలో సార్వజనీనంగా పాదుకొనేందుకు ఇంకా కొంతకాలం పట్టొచ్చుననీ తోస్తుంది. ఈ క్రింద ఇచ్చిన నియమాలూ, ఉదాహరణలూ మధ్యకోస్తా మాండలికానికి సంబంధించినవి.
(అ) నామవాచకాల్లో మేషస్వరం :- ఒక పదంలో ఏకారం గల హల్లు మొదటి అక్షరమై, అకార, ఆకారాలతో కూడుకున్న హల్లు రెండో అక్షరంగా ఉన్న సందర్భాల్లో మొదటి అక్షరంలోని ఏకారం వైకల్పికంగా మేషస్వరంగా ఉచ్చరించబడుతుంది. (అంటే అలా ఉచ్చరించడం అన్నిసందర్భాల్లోనూ తప్పనిసరి కాదని తాత్పర్యం) వ్యావహారికంలో ఈ విధమైన ఉచ్చారణ ఉభయభాషాపదాలకీ సమానమే.
ఉదాహరణకి :- సేవకుడు. ఇందులో మొదటి అక్షరం “సే”. ఇది ఏకారం గల హల్లు. దీని తరువాత రెండో అక్షరంగా ఉన్న “వ” అనేది అకారం గల హల్లు. కనుక పై నియమం ప్రకారం ఇందులోని “సే” మేషస్వరంగా ఉచ్చరించబడుతుంది. sævakuDu.
మఱికొన్ని ఉదాహరణలు :- 
ప్రేమ-ప్ర్యావఁ 
మేడ – మ్యాడ
మేళం – మ్యాళం
బేరం – బ్యారం 
మేర – మ్యార
మేక - మ్యాక
ఏవ – యావ
జేన – జాన
చేమంతి - చామంతి
కేకక్యాక
పేక ప్యాక
వేళ - వ్యాళ
చేమదుంపచ్యావఁదుంప
చేవ - చ్యావ
తేగలు త్యాగలు
తేడా త్యాడా
నేతపని న్యాతపని
లేతపిందె ల్యాతపిందె
లేగదూడ ల్యాగదూడ
డేగకన్ను డ్యాగకన్ను మొ|| 
అపవాదాలు :- దేహం, స్నేహం, వేగం, క్లేశం మొ||
క్రియాపదాల్లో మేషస్వరం :-  ఇది హెచ్చుగా మహతీ-ఏకవచనేతర భూతార్థ (past tense) క్రియల్లో వినిపిస్తుంది. ఉదాహరణకి- వెళ్ళారు, చెప్పాడు, మారాయి, తన్నావు, తిట్టావు, చేసాను మొ||

అపవాదాలు (Exceptions) :- అన్నాడు, తిన్నారు, కన్నాను, విన్నావు, పడ్డాయి మొ||
(సశేషం) 

1 కామెంట్‌: