12, ఏప్రిల్ 2014, శనివారం

లిప్యంతరీకరణ సమస్యలు-2 (సమాప్తం)



లిప్యంతరీకరణలో తెలుగువారు పోయే వింతపోకడలు
అందఱమూ తెలుగువాళ్ళమే అయినా, అనుదినమూ తెలుగే మాట్లాడుతున్నా మన మాతృభాష స్వభావం గుఱించి మనకి తెలిసినది చాలా తక్కువ. (వాస్తవానికి ఆంగ్లాక్షరాల ప్రయోగం గుఱించి తెలిసినది కూడా చాలా తక్కువే) కారణం చేత తెలుగుపదాల్ని మౌలికంగా ఎలాగైతే పలకమో అలాగే రోమక లిపిలో వాటిని వ్రాసేయడం జఱుగుతోంది. తెలుగులోని /ఈకారాల్ని ఇంగ్లీషు E గా లిప్యంతరీకరిస్తున్నారు ఇప్పటికీ చాలామంది. అంటే E అనే అక్షరం యొక్క పేరునీ, లేఖనంలో దాని ధ్వనినీ ఒకటిగా భావిస్తున్నారన్నమాట. తెలుగులో ఒక అక్షరప్పేరూ, దాని లేఖనధ్వనీ ఒకేలా ఉంటాయి. కానీ అభారతీయ భాషల్లో రెండూ పూర్తిగా వేఱువేఱు. నిజానికి మూలాంగ్ల స్పెల్లింగులలోని E ఎక్కువ సందర్భాల్లో ఎకారంగా గానీ, అకారంగా గానీ పలకబడుతుంది. లేదా తూష్ణీం (silent) అవుతుంది. /ఈకారాలుగా పలికే సందర్భాలు ఉన్నాయి గానీ సాపేక్షంగా చాలా తక్కువ. ప్రస్తుతం మనవారు /ఈకారాల్ని ఇలా లిప్యంతరీకరిస్తున్నారు.

     (i)           ఇప్పుడు                    eppudu
(ఆంగ్లోచ్చారణలో ఇది ఎప్పుడు ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు ippudu)
(ii)          ఈదర                      Edara
(ఆంగ్లోచ్చారణలో ఇది ఎదర ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Eedara)
(iii)        ఈమని                    Emani
(ఆంగ్లోచ్చారణలో ఇది ఏమని/ ఎమాని ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Eemani)

() ఇహపోతే తెలుగువారు తఱచూ చేసే లిప్యంతరీకరణ పొఱపాట్లలో అన్నింటికన్నా బహువిస్తారమైనదీఘోరాతిఘోరమైనదీ పదాది ఎకారాన్ని Ye అని వ్రాయడం. నిజానికి దాన్ని E అనే వ్రాయాలి. అందుకనే మీరు గమనించే ఉంటారు -  తెలుగువారిలో చాలామంది పేర్ల పొడక్షరాలు (initials)  Y తో మొదలుకావడం. ఇందులో ఇంకో ఆసక్తికరమైన వాస్తవమేంటంటే –  అసలు యకారం (Y) తో మొదలయ్యే పదం ఒక్కటి కూడా తెలుగుభాషలో లేదు. సూత్రానికి మన ఇంటిపేర్లు మినహాయింపు కాదు. అలా మొదలయ్యేవన్నీ తప్పనిసరిగా సంస్కృతమో, లేదా అలాంటి మఱో భాషో అయ్యుంటాయి.

అలాంటిది, ఎకారంతో మొదలవ్వాల్సిన మన ఇంటిపేర్లన్నీ ఇలా పూర్తి అసహజంగా, మన భాషాస్వభావానికి విరుద్ధంగా Ye తో మొదలవ్వడానికి వెనక మనవారి అవగాహనాలోపాలు రెండు పనిచేస్తూండొచ్చు. ఒకటి ఇందాక చెప్పుకున్నట్లు – E అనే ఆంగ్లాక్షర నామమూ, ధ్వనీ రెండూ ఒకటేనని భ్రమించడం. అందుమూలాన ఒక Y ని ముందుచేర్చడం ద్వారా మార్గాంతరాన్ని కల్పించుకునే ప్రయత్నం. రెండోది - తెలుగులో కూడా యకారాది పదాలున్నాయనే అపోహ. అపోహకి కారణం తెలుగులోకి వచ్చిచేఱిన పరభాషా పదాలూ, అంతకంటే ముఖ్యంగా గ్రాంథికంలో కనిపించే యడాగమ సంధిరూపాలూ ( అది యెక్కడ? మీ జన్మభూమి యేది ? ఇత్యాది). యకారాది రూపాలు తెలుగే అయినా వాటిని ప్రయోగించిన సందర్భం గ్రాంథికం కాబట్టి అక్కడ అవి సాధురూపాలే. కానీ అవే అన్నిచోట్లా సాధురూపాలనీ, [] [] అనే అచ్చులతో పదం ప్రారంభం కావడం బహుశా తప్పనే భ్రమ లిప్యంతరీకరణలో మనచేత పొఱపాట్లు చేయిస్తోంది. ఎకారాది పదాల్ని ప్రస్తుతం మనవారు ఇలా వ్రాస్తున్నారు :

     (i)           ఎద్దనపూడి    Yaddanapudi             (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Eddhanapoodi)
(ii)          ఎడ్లపాడు      Yedlapadu                 (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Edlapadu)
(iii)        ఎద్దుమైలారం  Yeddumailaram        (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Eddhumailaram)

() పై పొఱపాటులాంటిదే ఉకార, ఊకార, ఒకార, ఓకారాలతో మొదలయ్యే పదాల్ని V అనే అక్షరంతో వ్రాయడం కూడా ! నిజానికి తెలుగులో యకారాది పదాలు లేనట్లే వు, వూ, వొ, వోలతో మొదలయ్యే పదాలు కూడా ఎక్కడా లేవు. పొఱపాటు కూడా - u అనే ఆంగ్లాక్షర నామమూ, ధ్వనీ ఒకటేననే దురభిప్రాయంలో చోటుచేసుకున్నట్లు తోస్తుందిమనవారు ఇలా వ్రాస్తున్నారు :
(i)            ఉయ్యూరు    Vuyyuru                     (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Uyyooru)
(ii)           ఊరు           Vuru                           (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు – Ooru )
(iii)          ఒంటిమిట్ట     Vontimitta                 (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Ontimitta)
(iv)          ఓరుగంటి      Voruganti                   (సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Oruganti)

() మన లిప్యంతరీకరణ పొఱపాట్లకి తఱచుగా బలయ్యే అక్షరాల్లో తాలవ్య చకార, జకారాల దురదృష్టమూ పెద్దదే. మచ్చుకు మనవారు వాటిని ఇంగ్లీషులో వ్రాసే విధానం ఇలా ఉంటుంది.
(i)           చల్లపల్లి                    Challapalli 
(ఆంగ్లోచ్చారణలో ఇది చెల్లపల్లి ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Tsallapalli)
(ii)          చుండూరు                Chundur    
(ఆంగ్లోచ్చారణలో ఇది చ్యుండూర్ ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Tsundooru)
(iii)        చొల్లంగి                     Chollangi  
(ఆంగ్లోచ్చారణలో ఇది చ్యొల్లంగి ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Tsollangi)
(iv)         జక్కంపూడి               Jakkampudi
(ఆంగ్లోచ్చారణలో ఇది జెక్కంపుడి ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Zakkampoodi/ Dzankkampoodi)
(v)          జుక్కల్                     Jukkal
(ఆంగ్లోచ్చారణలో ఇది జ్యుక్కల్ ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Zukkal/ Dzukkal)
(vi)         జొన్నలగడ్డ               Jonnalagadda
(ఆంగ్లోచ్చారణలో జ్యొన్నలగడ్డ ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు Zonnalagadda/ Dzonnalagadda)
(vii)       జొన్నాడ                   Jonnada
(ఆంగ్లోచ్చారణలో ఇది జ్యొన్నాడ ; సాధుత్వానికి దగ్గఱగా ఉండే స్పెల్లింగు – Zonnada/ Dzonnada)

ఇప్పుడు చేస్తున్నట్లుగా వ్యావహారికవాదం పేరుతో పాఠశాలల్లో వ్యాకరణ శిక్షణ పట్ల శీతకన్నువేయడం కొనసాగితే గ్రాంథిక స్వరూపమే కాదు, ఆఖరికి వ్యావహారిక స్వరూపం కూడా అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉందని మన లిప్యంతరీకరణ అయోమయాలు తెలియజేస్తున్నాయి. (సమాప్తం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి