29, ఏప్రిల్ 2014, మంగళవారం

తెలుగులో మేషస్వరం-2



షస్వరాన్ని ఈ విధంగా లిపిబద్ధం చెయ్యడంలో ఉన్న మఱో ఉద్దేశం – తప్పనిసరైన అన్యదేశ్యాల నుంచి సాంకేతిక ఆదానాల్ని (technical borrowings) మూలవిధేయంగా (faithful to the original) తీసుకోగలిగేలా సులభతరం చెయ్యడం, ఆ విధంగా తెలుగులో సాంకేతిక పాఠ్యపుస్తకాల రచనాపరంగా ముందుకు పోవడం. 


అప్పట్లో ఈ విషయమై మా మిత్రుల మధ్య జఱిగిన ఒక విద్యాత్మక చర్చలోని అంశాల గుఱించి ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాదనుకుంటా. శ్రీ చరసాల ప్రసాద్ గారనే మిత్రుడు ఈ ప్రయత్నం గుఱించి ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అప్పుడు వారితో నే నన్నాను : అవసరాన్ని బట్టి పాత అక్షరాలు మఱుగున పడడం, కొత్త అక్షరాలు వాడుకలోకి రావడం మామూలే. వెయ్యేళ్ళ క్రితం మన తెలుగులో బండిఱా లాంటి ఒక విచిత్రమైన అక్షరం [ష్జ] ఉండేది. బండిఱా లో ఉన్న అడ్డగీత తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది దాని వ్రాతపద్ధతి. దాన్ని ఇటు [ళ] గానూ కాకుండా అటు [ష] గానూ కాకుండా మధ్యరకంగా పలికేవారు. నన్నయగారు ఆ అక్షరాన్ని తొలగించారని కొంతమంది నమ్ముతున్నారు. కాదు, దానంతటదే వాడుకలోంచి కనుమఱుగైందని ఇంకొందఱు నమ్ము తున్నారు. మన తెలుగులో కనుమఱుగైనా [] అనే వర్ణం రూపంలో అఱవంలో అది ఇప్పటికీ సజీవమే. మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టకముందు తమిళంలో [ష, , క్ష, శ్రీ] అనే అక్షరాలు ఉండేవి కావు. ప్రాచీన గ్రంథలిపి బాటలో ఆయన తమిళ లిపికి చేసిన సంస్కరణల్ని తమిళులు ఆమోదించి ముద్రణలో వాటికి స్థానం కల్పించారు. అలాగే Bishop Caldwell రాకముందు తమిళంలో [ఏ] అనే దీర్ఘం ఉండేది కాదు. హ్రస్వరూపం ఒక్కటే ఉండేది. ఉచ్చారణలో ఉన్నప్పటికీ లిపి మాత్రం దాన్ని ప్రతినిధించేది కాదు.”   

మఱో మిత్రుడు శ్రీ వై.రామనాథరెడ్డిగారు నా కొత్త అక్షరాన్ని పూర్తిగా ఆమోదించకపోయినా ఈ దిశలో ఏదో ఒక ప్రయత్నం జఱిగినందుకు తమ హర్షాన్ని వెలిబుచ్చారు. అయితే అంతర్జాతీయ యునికోడ్ సంస్థవారు కనీసం గత వందేళ్ళుగా అచ్చులో ఉన్న వర్ణాలకే యునికోడ్ సంకేతాల్ని కేటాయిస్తారని ఆయన అన్నారు
మేషస్వరానికీ హ్రస్వరూపం ?

అప్పట్లో ఫ్రాన్సులో విద్యాభ్యాసం చేస్తున్న శ్రీ కిరణ్ వారణాశి అనే యువభాషావేత్త ఈ విషయమై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “దీర్ఘరూపంతో పాటు హ్రస్వరూపం కూడా ఆలోచిస్తే ఎలావుంటుంది ? మన తెలుగులో ఇంచుమించు ప్రతీ అచ్చుకి దీర్ఘ-హ్రస్వ రూపాలు రెండూ ఉంటాయి కదా !  నే', వే', తాటే'కు, డే'న్సు, 'క్షన్, 'క్టివేట్ (అనే దీర్ఘ స్వరాలకి మీరు సూచించిన గుర్తు సరిపోతుంది) ఇంగ్లీషులోని హ్రస్వ-మేషస్వరం కూడా ఒకటుంది. ఉదాహరణకు, వె'ర్టికల్, సె'ర్టిఫికెట్, పె'ర్టినెంట్ మొదలైన పదాలు.  దీనికి ఇంకో గుర్తు అవసరమంటారా ?” అన్నారు. 

అందుకు నేనాయనతో, “మేషస్వరానికి హ్రస్వోచ్చారణ తెలుగులో కూడా ఉంది. కాని దానికి హ్రస్వరూపం ఉండడం తప్పనిసరి కాదు. ప్రస్తుతానికి ఎత్వం సరిపోతుంది. దానికీ దీనికీ మధ్య ఉచ్చారణలో అంత గమనీయమైన వ్యత్యాసం  (noticeable variance) లేకపోవడం ఒక సమస్య. మన భాషలో [] అనే ఒక పాములాంటి అక్షరాన్ని ఒకటో తరగతిలో అందఱికీ నేర్పుతారు. ఆ తరువాత తమ జన్మలో ఎవఱూ దాన్ని ఏ పదంలోనూ వాడగా చూసి ఉండరు. అది అనుపయుక్తమైన ఆఱో వేలుగా, పులిహోరలో కఱివేపాకులా మిగిలిపోతుంది. ఒక కొత్త అక్షర కల్పన గానీ, కొత్త పదకల్పన గానీ ఒక బిడ్డని కనడంలాగా మన మీద పెద్ద బాధ్యతని మోపుతాయి. కొత్త అక్షరాలు వాటిని నేర్చుకునే చిన్నారుల మీద బరువు మోపుతాయి. ఇప్పటికే మనకు 50 కంటే ఎక్కువ అక్షరాలున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం సంస్కృతానికి మూలవిధేయమైన తత్సమాల్ని అరువు తెచ్చుకోవడం కోసం ఉంచుకున్నవి. మనకిప్పుడు ఇంగ్లీషు పట్ల మూలవిధేయత అవసరమై ఇంకొకటి జతచేర్చాం. బాధాకరమే కాని తప్పలేదు.” అన్నాను.
తెలుగులో మేషస్వరం పలికే సందర్భాలు
మేషస్వరం కోస్తా, రాయలసీమ మాండలికాల్లోనే తప్ప శుద్ధమైన తెలంగాణ మాండలికంలో శ్రుతిగోచరం కాదు. కోస్తా, రాయలసీమ ప్రజలు పలికే మేషస్వరం కూడా ససందర్భీణం కాదు. అంటే, వారు కొన్ని సందర్భాల్లో పలికితే వీరు కొన్ని సందర్భాల్లో పలుకుతారు. ఉదాహరణకి, కోస్తాలో “లేదు” అని చేసే వ్యక్తీకరణని రాయలసీమవారు “ల్యా” అని సరిపెడతారు. అలాగే కోస్తాలో “ఉన్నాడు” అనేదాన్ని సైమేయులు “ఉన్న్యాడు” అని పలుకుతారు. ఇందుకు భిన్నంగా, సైమేయులు “ఉంటాడు” అని పలికేదాన్ని కాళింగులు (కళింగ దేశస్థులు) “ఉంట్యాడు” అని పలుకుతారు. ఇదంతా గమనించినప్పుడు మన భాషలో మేషస్వర ప్రతిపత్తి ఇంకా ద్రవస్థితిలోనే ఉందనీ, దాని ఉచ్చారణప్రకరణాలు భాషలో సార్వజనీనంగా పాదుకొనేందుకు ఇంకా కొంతకాలం పట్టొచ్చుననీ తోస్తుంది. ఈ క్రింద ఇచ్చిన నియమాలూ, ఉదాహరణలూ మధ్యకోస్తా మాండలికానికి సంబంధించినవి.
(అ) నామవాచకాల్లో మేషస్వరం :- ఒక పదంలో ఏకారం గల హల్లు మొదటి అక్షరమై, అకార, ఆకారాలతో కూడుకున్న హల్లు రెండో అక్షరంగా ఉన్న సందర్భాల్లో మొదటి అక్షరంలోని ఏకారం వైకల్పికంగా మేషస్వరంగా ఉచ్చరించబడుతుంది. (అంటే అలా ఉచ్చరించడం అన్నిసందర్భాల్లోనూ తప్పనిసరి కాదని తాత్పర్యం) వ్యావహారికంలో ఈ విధమైన ఉచ్చారణ ఉభయభాషాపదాలకీ సమానమే.
ఉదాహరణకి :- సేవకుడు. ఇందులో మొదటి అక్షరం “సే”. ఇది ఏకారం గల హల్లు. దీని తరువాత రెండో అక్షరంగా ఉన్న “వ” అనేది అకారం గల హల్లు. కనుక పై నియమం ప్రకారం ఇందులోని “సే” మేషస్వరంగా ఉచ్చరించబడుతుంది. sævakuDu.
మఱికొన్ని ఉదాహరణలు :- 
ప్రేమ-ప్ర్యావఁ 
మేడ – మ్యాడ
మేళం – మ్యాళం
బేరం – బ్యారం 
మేర – మ్యార
మేక - మ్యాక
ఏవ – యావ
జేన – జాన
చేమంతి - చామంతి
కేకక్యాక
పేక ప్యాక
వేళ - వ్యాళ
చేమదుంపచ్యావఁదుంప
చేవ - చ్యావ
తేగలు త్యాగలు
తేడా త్యాడా
నేతపని న్యాతపని
లేతపిందె ల్యాతపిందె
లేగదూడ ల్యాగదూడ
డేగకన్ను డ్యాగకన్ను మొ|| 
అపవాదాలు :- దేహం, స్నేహం, వేగం, క్లేశం మొ||
క్రియాపదాల్లో మేషస్వరం :-  ఇది హెచ్చుగా మహతీ-ఏకవచనేతర భూతార్థ (past tense) క్రియల్లో వినిపిస్తుంది. ఉదాహరణకి- వెళ్ళారు, చెప్పాడు, మారాయి, తన్నావు, తిట్టావు, చేసాను మొ||

అపవాదాలు (Exceptions) :- అన్నాడు, తిన్నారు, కన్నాను, విన్నావు, పడ్డాయి మొ||
(సశేషం) 

తెలుగులో మేషస్వరం-1





ank, తాటాకు వంటి పదాల్లో  అత్యంత వక్రంగా పలికే అచ్చునే మనం ఇక్కడ మేషస్వరమనే పేరుతో వ్యవహరిస్తున్నాం. ఈ పేరుని ఈ అర్థంలో ఒక పండితుడెవఱోపేరు జ్ఞాపకం లేదు - 1970 ల పూర్వభాగంలో యువభారతి (హైదరాబాద్) సంస్థవారు ప్రచురించిన మహతి అనే వ్యాససంకలన గ్రంథంలో వాడారు. అది నిరభ్యంతరమేనని తలచి నేను కూడా వాడుతున్నాను. మేషంఅంటే మేక. అదిమ్మేఅని ఆక్రందించే బాణీలోనే మనమీ అక్షరాన్ని పలుకుతాం గనుక ఇది మేషస్వరంఅన్నమాట. , , , ఓ లు వక్రాలనీ, , ఔలు అతివక్రాలనీ వ్యాకరణ పరిభాష. ఆ క్రమంలో ఈ స్వరాన్ని అత్యంత వక్రంగా అభివర్ణించడంలో తప్పులేదనుకుంటాను.
ప్రస్తుతం మేషస్వరాన్ని లిపిబద్ధం చేస్తున్న పద్ధతి - బాగోగులు
సూక్ష్మంగా పరిశీలిస్తే ఉచ్చారణ రీత్యా మేషస్వరం పుర్తిగా యాకారం గానీ, ఆకారం గానీ, ఏకారం గానీ కాదు. దానికదే విలక్షణం. కానీ మన వ్రాతలో దీన్ని ఈ మూడక్షరాలతోనూ ప్రతినిధించడం కద్దు. అయితే యాకారంతో సూచిస్తే ఆంగ్లవిద్యావంతులకీ, తదభిమానులకీ ప్రత్యేకంగా చాలా ఎగతాళీ, కోపం కూడాను ! ఈ ఎగతాళిలో, కోపంలో ఒకటి-రెండు పొఱపాటు భావనలు దాగున్నాయి. ఒకటిమేషస్వరం దేశి తెలుగుపదాల్లో నాస్తి అని భావించడం. రెండుఆంగ్లలిపే దాన్ని వ్యక్తీకరించగలదనీ, తెలుగులిపికి ఆ సత్తా లేదనీ తలపోయడం. ఈ భావనల్లో పడి, అది గల ఆంగ్లపదాల్ని తెలుగులిపిలో బాంకు, బేంకు, బేలన్సు, కేన్వాసు అని వ్రాస్తున్నవారూ లేకపోలేదు. తెలుగుపదాల్ని కూడావచ్చేడు, చెప్పేడుఅన్నట్లు వ్రాయడం ఓ తరం క్రితం వఱకూ జఱిగింది. ముఖ్యంగా కళింగదేశపు సాహిత్యంలో మనకీ వ్రాతపద్ధతి అడుగడుగునా దర్శనమిస్తుంది
అయితే అటువంటివారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. లేఖనచిహ్నాలు (లిపి) – అవి ఏ భాషకి చెందినప్పటికీ ధ్వనికి సూచనామాత్రాలే (indicative) తప్ప ఖచ్చితాలు (exact) కావు. అంటే మనం అక్షరాల్ని వ్రాసినట్లుగానే పలుకుతున్నామనే భావన మన ఊహే తప్ప వాస్తవం కాదు. కారణం - ఏ భాషాలిపి అయినా ఆ భాష యొక్క ఉచ్చారణస్వరూపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించదు, ప్రదర్శించజాలదు. ఈ పలకడాల్లో సగం పలకడాల్లాంటి వైవిధ్యం కూడా చాలా ఉంటుంది. ఇతర భాషలతో పోల్చినప్పుడు మన తెలుగుభాషలో లిపికీ, ఉచ్చారణకీ మధ్య కాస్త హెచ్చుస్థాయిలో పరస్పరానురోధం (ఆనుకూల్యం) లేకపోలేదు. కానీ ఆ అనురోధం అన్ని సందర్భాల్లోనూ కాదు. ప్రతిసారీ అలా ఉండనక్కఱలేదు కూడా. Walk, talk లాంటి ఆంగ్లపదాల్లో [l] తూష్ణీం (silent) కావడాన్నీ, tough, laugh లాంటి పదాల యొక్క స్పెల్లింగులో లేని [f] ధ్వనినీ అంగీకరించే ఆంగ్లాభిమానులుతెలుగులిపిలో మేషస్వరానికి యాకారం ప్రాతినిధ్యం వహించడమనే చిన్నవిషయాన్ని భరించలేకపోవడమే ఇక్కడి వైచిత్రి. ఏతావతా చెప్పేచ్చేదేంటంటేతెలుగులో Bank ని బ్యాంకు అని వ్రాయడం - ఖచ్చితంగా వ్రాసినట్లే పలకాలని కాదు. ఆంగ్ల ఆదాన శబ్దాల్లో అలాంటి యాకారం ఎక్కడెక్కడైతే తటస్థిస్తుందో అక్కడల్లా మేషస్వరం పలుకుతుందనే సూచన కోసమే. అంతే ! అందుచేత మేషస్వరం కోసం ఆ గుణింతాన్ని ఉపయోగించడంలో ప్రాథమికంగా దోషమేమీ లేదు.
ఆంగ్లంలో మేషస్వరం
ఇహపోతే, “మేషస్వరాన్ని ఆంగ్లలిపి వ్యక్తీకరించగలదా ? లేదా ?” అనే విచికిత్స. ఇందులో వాస్తవమేంటంటే, తెలుగులో లాగా ఆంగ్లలిపిలో ఏ అక్షరమూ ఏ ఒక్క ధ్వనికీ అంకితం కాదు. ఆ భాషావర్ణాల ధ్వనిస్వభావం (sound property) పదం పదానికీ చంచలం. ఒక్క [a] అనే అక్షరాన్నే అనేక ధ్వనుల కోసం ఉపయోగించడం కద్దు. దానికి తోడు, మేషస్వరం కోసమని చెప్పి ఆంగ్లలిపిలో ప్రత్యేకంగా అక్షరమేదీ లేదు. కానీ అంతర్జాతీయ ధ్వానిక వర్ణమాల (International phonetic alphabet or IPA) లో దీన్ని సూచించేందుకు æ అనే చిహ్నాన్ని వాడతారు. దీన్ని Near-open front unrounded vowel (ఉపవివృత అగ్ర అవర్తులాచ్చు) అని పిలుస్తారు. అయితే చిహ్నాన్ని ash అనే పేరుతో ఆంగ్లేయులు సైతం బహు శతాబ్దులుగా వాడుతున్నప్పటికీ దీనికి శ్కాండినేవియన్ వర్ణమాలల్లోనే తప్ప ఆంగ్ల వర్ణమాలలో గానీ, దాన్ని నేర్పే పాఠశాలల్లో గానీ శిష్టహోదా (formal status) లేదు. కారణం - వారు దీన్ని ఓ ప్రత్యేక వర్ణంగా కాక రెండచ్చులు (a, e) కలిస్తే ఏర్పడే సంయుక్తాచ్చు (diphthong) గా చూడడమే. ఫ్రెంచిలాంటి భాషల వర్ణమాలల్లో చిహ్నం లేకపోలేదు. కానీ పలుకుబడి తీరు పూర్తిగా వేఱు. వారు దీన్ని [ai లేదా ] అని ఉచ్చరిస్తారు.
ఇతర భారతీయ భాషల్లో మేషస్వరం
తెలుగు, కన్నడ భాషల్లో తప్ప ఇతర భారతీయ భాషల్లో మేషస్వరోచ్చారణ ఉన్నట్లుగా నా దృష్టికి రాలేదు. కన్నడ భాషలో కూడా మన తెలుగులాగానే ఉచ్చారణ మాత్రమే ఉన్నది. దానికో ప్రత్యేక అక్షరం లేదు. ఉదాహరణకి- ఏకె (ఎందుకు) అని వ్రాస్తారు గానీ వ్యవహారంలో మటుకూ యాకె అని పలుకుతారు. వాడుక కన్నడంలో ఘటిల్లే సంధిరూపాల్లో కూడా ఈ స్వరం వినవస్తుంది. ఉదాహరణకి :- బందవరు యారు (వచ్చినవారు ఎవఱు) ? దీన్ని గబగబా కలిపి మాట్లాడేటప్పుడు బందవర్యారు ? అనడం జఱుగుతుంది. ఇక్కడ ర్యా అనే అక్షరంలో కనిపిస్తున్న యకారాన్ని యకారంగా పలక్కూడదు.   
మేషస్వరాన్ని తెలుగులో ఎలా వ్రాస్తే బావుంటుంది ?  
జీవిస్తున్న భాష యొక్క వాస్తవిక స్వరూపాన్ని ప్రదర్శించలేకపోవడం లిపిలోని లోపమేనని ఒప్పుకోక తప్పదు. ఈ లోపాన్ని పూరించాలని కొందఱు పూర్వతరాలవారు కూడా తమ ప్రయత్నం తాము చేశారు. ఉదాహరణకి, మహాకవి గుఱజాడ అప్పారావు పంతులుగారు మేషస్వరం పలికే అక్షరాల పైన ఒక అపాస్ట్రఫీ గుర్తుని ఉంచడం ద్వారా దాన్ని సూచించారు. ఉదాహరణకి :- నేల. ఇది ఉచ్చారణలో న్యాల. దీన్ని వ్రాయడానికి పంతులుగారు నా’ల అని ప్రయోగించారు. అయితే అందులోని ధ్వనిపరమైన ఔచితిని తదనంతర రచయితలు గుర్తెఱిగి అనుసరించారు కారు. పంతులుగారి ఉద్దేశం మంచిదే అయినా అపాస్ట్రఫీని అలా అక్షరాల పైన ఉంచే సందర్భం వేఱు. సాధారణంగా మాయమైన ధ్వనుల్ని సూచించడం కోసం వాటి స్థానంలో అపాస్ట్రఫీని పెట్టడం రివాజు. ఉదాహరణకి, it is nice అనే వాక్యంలో is ని s గా కుదించి, దాని పక్కన మాయమైన i ని అపాస్ట్రఫీతో సూచిస్తూ it's nice అని వ్రాస్తారు. కానీ అలా మాయం కాకుండా ఉచ్చారణలో నిక్షేపంలానే ఉన్న మేషస్వరాన్ని సూచించడానికి అది సరైన మార్గమని తోచదు. పైపెచ్చు, మేషస్వరం స్వయంగా తానొక ధ్వని కాగా దాన్ని అపాస్ట్రఫీలాంటి విరామచిహ్నాల (punctuation marks) తో సూచించడం దాని స్థాయిని తగ్గించడమే అవుతుంది.
ఇటీవలి కాలంలో ప్రముఖ బ్లాగరు గీతాచార్యగారు తమ బ్లాగులో మేషస్వరాన్ని సూచించడం కోసం అకారదీర్ఘం పక్కన తెలుగంకె 2 వ్రాయడం మొదలుపెట్టారు, బహుశా దాన్ని అక్షరం పైన పెట్టడానికి కలనయంత్రాల్లోనూ, అంతర్జాలంలోనూ అవకాశం లేక ! అంటే మేషస్వరం రెండో కారం అని వారి ఉద్దేశం కావచ్చు. ఇది చకార, జకారాల మీద రెండంకె వేసి తాలవ్య చ-జల్ని సూచించిన బ్రౌన్ దొరగారి పద్ధతిని జ్ఞప్తికి తెస్తోంది. ఈ పద్ధతి కూడా బాగానే ఉంది. 
నేను సైతం
మేషస్వరానికి ఓ ప్రత్యేక లిపిచిహ్నం ఉంటే బావుంటుందని భావించి 2006-07 ప్రాంతంలో నేనీ క్రింది విధంగా రూపొందించాను.
 (సశేషం)

19, ఏప్రిల్ 2014, శనివారం

ళకార మీమాంస-4 (సమాప్తం)

క్కడ గమనించాల్సిన విశేషమేమంటే – “డలయో రభేదః అని చెప్పే వ్యాకరణ సంప్రదాయాలున్నప్పటికీ, భారతీయుల ఉచ్చారణ అలవాట్ల దృష్ట్యా మూర్ధన్య డకారం నేరుగా అంతఃస్థ లకారంగా మారదుఅనేది. సదరు సూత్రాలు శబ్దపరిణామ ఫలితాన్ని చెబుతున్నాయే తప్ప అది జఱిగే ప్రక్రియని వివరించడం లేదు. కనుక మూర్ధన్య డకారం లకారంగా మారడానికి ముందు కొంతకాలం పాటు మూర్ధన్య ళకారంగా ఉచ్చరించబడే దశ ఒకటి అవశ్యం ఉండక తీఱదు. పైన జల-జడశబ్దాలకిచ్చిన అర్థాల మధ్య పైకి వైరుద్ధ్యం ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ వాటి నడుమ గల కార్యకారణ సంబంధాన్ని కూడా గమనంలో ఉంచుకున్నట్లయితే జళమే జలశబ్దం యొక్క పూర్వరూపమని విశదమౌతుంది. ఇటువంటి పదాలు ఇంకా ఎన్నున్నాయో పరిశోధించి వెలికితీయాల్సి ఉంది.

లయప్రతిక్షేపం ఫలితంగా సంస్కృతంలో కొన్ని పదాలు రెండర్థాలనివ్వడం మొదలుపెట్టాయి. మచ్చుకు నా దృష్టికొచ్చిన కొన్ని పదాలు :

వ్యాలః – పాము, ఏనుగు
కాలః – కాలము, యముడు, నలుపు
వాలః - తోక, ఆయుధం
ఆలిః – పంక్తి, వంతెన
తాలః – తాడిచెట్టు, సంగీత తాళం
శూలః – బల్లెం, నొప్పి
వేలా – సమయం, చెలియలికట్ట
కలా – భాగం, నైపుణ్యం
కోలమ్/కోలః – తెప్ప, రేగుపండు, అడవిపంది
కువలయమ్ – భూమి, కలువ
దలమ్  ఆకు, సైన్యం

పాణినీయంలో ళకారానికి స్థానమివ్వలేదనేది నిజమే, మాహేశ్వరసూత్రాల్ని పరిశీలించినప్పుడు. కానీ ఆ వ్యాకరణం వేదసాహిత్యాన్ని నిలబెట్టేందుకే రచించబడిందనే మాటలో వాస్తవం లేదు. పాణినికి పూర్వం వ్యాకరణగ్రంథాలు లేకపోతేనే ఆ మాట నిజం. కానీ మనకి అష్టాధ్యాయిలో పూర్వాచార్యుల పేర్లు అనేకం దర్శనమిస్తాయి. వారు ఏం వ్రాశారో మనకు తెలీకపోయినా పాణిని కంటే పురాతనులు గనుక వైదిక సంస్కృతాన్ని వ్యాకరించకుండా ఉండరనుకోవచ్చు. కనుక పాణినీయ లక్షణం ప్రధానంగా ఆనాటి శిష్టుల వ్యవహారంలోని లౌకిక సంస్కృతం కోసమే. అందువల్లనే అందులో ళకారానికి చోటు లభించలేదు. అప్పటికే ప్రాకృతాలు విస్తృతంగా వాడుకలోకి వచ్చేయడం జఱిగింది. నేటివారు ళకారం నిసర్గద్రవిడమని భ్రమిస్తున్నట్లే నాటివారూ దాన్ని ప్రాకృతానికి విలక్షణంగా పరిగణించి ఉంటారు. వైదికభాషకి ప్రథమ ప్రాకృతమని పేరుండడం కూడా ఈ అపోహకి దారితీసి ఉంటుంది. 

ఏతావతా, ళకార విస్మృతికి లోనైన ఉత్తరాదివారి ముద్రితగ్రంథాల్ని చూసి అవే సాధువని భ్రమించి అనుకరించే ప్రయత్నంలో మన తెలుగులిపిలో ఉన్న సంస్కృతగ్రంథాల ళకార పాఠాల్ని లకారపాఠాలుగా పరివర్తింవద్దని అందఱికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 
(సమాప్తం)